
తెలంగాణలో కష్టపడి అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఉన్నదానిలోనే కాదనకుండా మేలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అందరూ ఐక్యంగా ఉంటే.. వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించు కునే అవకాశం కూడా ఉంటుంది. కానీ.. ఆ ఐక్యతే కొరవడుతోంది. ఎవరికి వారు.. ఎక్కడికక్కడ అన్నట్టుగా వివాదాలు.. విభేదాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎందెందు చూసినా.. సమస్యలే కనిపిస్తున్నాయి. ఇదీ.. తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో కనిపిస్తున్న ముఖ చిత్రం!
ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇప్పటికి మూడు సార్లు క్రమశిక్షణ సంఘాలను ఏర్పాటు చేసి.. నాయకులపై చర్చించినందుకే!. సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు చిన్నపాటి వివాదాలు వస్తాయి. వాటిని సరిపుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ, తాజాగా సీనియర్ నాయకుడు మల్లు రవినేతృత్వంలో వేసిన క్రమశిక్షణ సంఘానికి అసలు క్షేత్రస్థాయిలో ఉన్న వివాదాలను గమనిస్తే.. తలపట్టుకునే పరిస్థితి వచ్చింది.
వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వివాదాలు, ఆధిపత్య పోరు… ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎటు వైపు నిలబడి ఎలాంటి తీర్పు ఇచ్చినా.. ఇబ్బందే అనే పరిస్థితి పార్టీలో ఏర్పడింది. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ కుంటుం బానికి వ్యతిరేకంగా.. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు వ్యతిరేకులు పోటెత్తారు. ఇక, ఆసిఫా బాద్ జిల్లాలో రాగి శ్రీనివాస్ దూకుడు పై సొంత నాయకులే విస్తుబోతున్నారు.
దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని 20పైగా ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఖైరతాబాద్ లో బీఆర్ ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్‌కు.. మాజీ కాంగ్రెస్ నేత పీజేఆర్ కుమార్తెకు మధ్య తారస్థాయి లో వివాదాలు కొనసాగుతున్నాయి. ఆమె కూడా ఫిర్యాదులు చేశారు. ఆమెపై దానం అనుచరులు ఫిర్యాదు లు ఇచ్చారు. మరోవైపు.. కంట్లో నలుసు మాదిరిగా జీవన్ రెడ్డి వ్యవహారం ఉంది. పఠాన్ చెరు నియోజక వర్గంలోనూ గూడెం మహిపాల్ రెడ్డి చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఇలా.. మొత్తంగా టీ కాంగ్రెస్‌లో వివాదాల పర్వం పెరుగుతూనే ఉంది. ఇవి పైకి కనిపిస్తున్నవని.. కనిపించని వివాదాలు.. అనేకం ఉన్నా యని పరిశీలకులు చెబుతున్నారు.