
బోస్టన్ : తనకు రావాల్సిన 2.2 బిలియన్ డాలర్ల గ్రాంట్లను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్సిటీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాజకీయ, సామాజిక మార్పుల కోసం క్యాంపస్‌లో నిర్వహించే ప్రచారాన్ని పరిమితం చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను హార్వర్డ్ విశ్వవిద్యాలయం బేఖాతరు చేసింది. దీంతో దానికి ఇవ్వాల్సిన ప్రభుత్వ గ్రాంట్లను ట్రంప్ నిలిపివేశారు. యూనివర్సిటీలో ప్రభుత్వ, నాయకత్వ సంస్కరణలు చేపట్టాలని, ప్రవేశాలకు సంబంధించిన విధానాలలో మార్పులు చేయాలని సూచిస్తూ ఈ నెల ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్‌కు లేఖ రాసింది. కొన్ని విద్యార్థి సంఘాల గుర్తింపును నిలిపివేయాలని కూడా ఆదేశించింది. అయితే ప్రభుత్వ డిమాండ్లకు తలవంచబోమని హార్వర్డ్ అధ్యక్షుడు అలన్ గార్బర్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ప్రభుత్వ నిధులను నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
‘అమెరికా ప్రజల ప్రాణాలను కాపాడడం, అమెరికా విజయాలను ముందుకు తీసుకుపోవడం, అమెరికా భద్రతను పరిరక్షించడం, ఆవిష్కరణల విషయంలో ప్రపంచ నేతగా అమెరికా స్థానాన్ని సుస్థిరం చేయడమే లక్ష్యంగా యూదు వ్యతిరేక ఆందోళనలకు, అది స్తంభింపజేసిన వైద్య, శాస్త్ర, సాంకేతిక, ఇతర పరిశోధనలకు మధ్య ఉన్న హేతుబద్ధమైన సంబంధాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు…గుర్తించలేకపోతోంది’ అని బోస్టన్ ఫెడరల్ కోర్టులో వేసిన దావాలో హార్వర్డ్ యూనివర్సిటీ తెలియజేసింది. పరిశోధనలకు సంబంధించిన నిధులను నిలిపివేయడం ద్వారా హార్వర్డ్ కార్యక్రమాలను, ఆవిష్కరణలను, వాటి పురోగతిని ముందుకు తీసుకుపోవడంలో ఎదురయ్యే పరిణామాలను ప్రభుత్వం గుర్తించలేకపోతోందని పేర్కొంది. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అమెరికా విలువలను ద్వేషిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులపై నిఘా వేయాలని ఈ నెల 11న రాసిన లేఖలో హార్వర్డ్‌కు ట్రంప్ ప్రభుత్వం సూచించింది. అధ్యాపక బృందాన్ని తనిఖీ చేయాలని కూడా చెప్పింది. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధిస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ డిమాండ్లు తమకు ముప్పుగా పరిణమించడమే కాకుండా గతంలో దేశంలోని యూనివర్సిటీలకు న్యాయస్థానం ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని కూడా కాలరాస్తున్నాయని హార్వర్డ్ అభిప్రాయపడుతోంది.