
సాధారణంగా, బంగారు దుకాణాల్లో లేదా రుణాలు ఇచ్చే సంస్థల్లో బంగారాన్ని అప్పగించి నగదు తీసుకుంటాం. అయితే, ఏటీఎంలో బంగారాన్ని డిపాజిట్ చేసి డబ్బులు తీసుకోవడం ఎప్పుడైనా చూశారా? పసిడి ఏటీఎం గురించి ఎప్పుడైనా విన్నారా? నూతన ఆవిష్కరణలలో ముందుండే చైనా ఇప్పుడు గోల్డ్ ఏటీఎంను అందుబాటులోకి తెచ్చింది. చైనాలోని షాంఘై నగరంలో ఒక షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ గోల్డ్ ఏటీఎం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
డబ్బులు విత్‌డ్రా చేయడానికి లేదా డిపాజిట్ చేయడానికి ఉపయోగించే ఏటీఎంలను మనం చూశాం. కానీ, బంగారాన్ని డిపాజిట్ చేసి నగదు పొందే ఏటీఎం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ విచిత్రమైన ఆవిష్కరణ నిజం. చైనాలోని షాంఘైలోని గ్లోబల్ హార్బర్ షాపింగ్ మాల్లో ఈ గోల్డ్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. షెన్జెన్కు చెందిన కింగ్‌హుడ్ గ్రూప్ ఈ స్మార్ట్ గోల్డ్ ఏటీఎంను తయారు చేసింది, ఇది ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ ఏటీఎంలో ఎవరైనా తమ వద్ద ఉన్న బంగారు నగలు, కడ్డీలు లేదా గోల్డ్ బిస్కెట్లను డిపాజిట్ చేయవచ్చు. 30 నిమిషాల్లోపు దాని విలువకు సమానమైన నగదు వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ ఏటీఎం ద్వారా బంగారం లావాదేవీలు చాలా సులభం. ముందుగా, యంత్రం బంగారాన్ని తూకం వేస్తుంది. అనంతరం, బంగారం 99.99% లేదా 99% స్వచ్ఛత కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది. 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను నిర్ధారించి, షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ యొక్క ప్రత్యక్ష ధరల ఆధారంగా విలువను చూపిస్తుంది. ఆ తర్వాత, ఆ రేటు ప్రకారం నగదును లెక్కిస్తుంది. 30 నిమిషాల్లోపు డబ్బులు వినియోగదారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతాయి. ఈ ప్రక్రియకు గ్రాముకు 18 యువాన్ (సుమారు 210 రూపాయలు) సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తారు.
ఈ ఏటీఎం 3 గ్రాముల కంటే ఎక్కువ బరువు మరియు కనీసం 50% స్వచ్ఛత కలిగిన బంగారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. ఈ లావాదేవీకి ఎటువంటి ధ్రువపత్రాలు లేదా కాగితాలు అవసరం లేదు, కానీ వినియోగదారులు తమ గుర్తింపు సంఖ్య మరియు బ్యాంక్ కార్డ్ వివరాలను నమోదు చేయాలి. ప్రస్తుతం, ఈ గోల్డ్ ఏటీఎం చైనా వినియోగదారులను బాగా ఆకర్షిస్తోంది. ఇటీవల ఒక్క రోజులో దాదాపు రెండు కిలోల బంగారం ఈ ఏటీఎంలో డిపాజిట్ అయినట్లు తయారీదారులు వెల్లడించారు. అయితే, ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటోందని, ఈ ఏటీఎం పనితీరు మరింత మెరుగుపడాలని వినియోగదారులు సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఏటీఎం ప్రజలకు తమ వారసత్వ బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. షాంఘైలో ఏప్రిల్ 16, 2025న ఈ ఏటీఎం ప్రారంభించినప్పుడు, బంగారం ధరలు ఔన్స్‌కు 3,400 డాలర్లు (గ్రాముకు సుమారు 1,000 యువాన్) దాటాయి. ఈ యంత్రం ఇప్పటికే చైనాలోని 100 నగరాల్లో ఏర్పాటైంది, షాంఘైలో రెండో ఏటీఎం త్వరలో అందుబాటులోకి రానుంది.