
దాదాపుగా మూడున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం కలిగిన నేత ఆయన. అంతే కాదు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కీలక శాఖలను నిభాయించిన దక్షత ఉంది. ఒక దశలో కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేసులో పోటీ పడిన పెద్ద తలకాయ ఆయన. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయనే కన్నా లక్ష్మీ నారాయణ.
ఆయన కాంగ్రెస్ లో ఉన్నపుడు రాజకీయ చక్రం గిర్రున తిరిగింది. హవా ఒక్క లెక్కన సాగింది. ఏపీలో కాంగ్రెస్ పతనం కావడంతో ఆయన సరైన చాయిస్ ఎంచుకోలేకపోయారు. టీడీపీలోకి వెళ్ళాలని నాడు భావించలేదు. దాంతో వైసీపీ వైపు కూడా మొగ్గు చూపకుండా బీజేపీలోకి వెళ్ళారు. జాతీయ పార్టీ కదా రాజ్యసభ అయినా దక్కుతుందని అంచనా వేశారు. అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ని ఇచ్చారు.
కానీ అప్పటికే టీడీపీతో పొత్తు బంధం తెగింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల కమల పార్టీ గెలుపు మాటే మరవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పదవి కూడా లేకుండా పోయింది. దాంతో కన్నా టీడీపీవా జనసేనా అన్నది ఆలోచించి ఎట్టకేలకు టీడీపీలో చేరారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించుకుని సత్తెనపల్లి టికెట్ కొట్టేశారు.
ఇక కూటమి ప్రభంజనంలో ఆయన భారీ మెజారిటీతో ఆనాటి మంత్రి అంబటి రాంబాబు మీద ఘన విజయం సాధించారు. ఇంకేముంది మంత్రి పదవి ఖాయమని లెక్క వేసుకున్నారు. తీరా చూస్తే ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. జనసేన కోటాలో నాదెండ్ల మనోహర్ కి ఆ పదవి వరించింది.
ఇక సామాజిక వర్గ సమీకరణలు రాజకీయ వ్యూహాలు టీడీపీ విధానపరమైన నిర్ణయాలు అన్నీ కలసి కన్నాకు మంత్రి సీటు ఫ్యూచర్ లో కూడా దక్కే చాన్స్ లేదని అంటున్నారు. యూత్ కే టీడీపీ ప్రాధాన్యత ఇస్తుందని అంటున్నారు.
మరో వైపు చూస్తే మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న కన్నా గత ఏడాదిగా పెద్దగా పెదవి విప్పలేదు. అసెంబ్లీలోనూ చర్చలో పాల్గొనలేదు. నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదని ఒక దశలో విమర్శలు వచ్చాయి.
ఇవన్నీ ఇలా ఉంటే కన్నా తాజాగా జగన్ సత్తెనపల్లి టూర్ మీద మాత్రం పెద్ద నోరు చేసుకున్నారు. జగన్ ఎలా వస్తారని ప్రశ్నించారు. ఆయన బెట్టింగ్ బ్యాచ్ ని పలకరిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఇలా గొంతు పెంచి మరీ జగన్ మీద ధాటీవా కన్నా విమర్శలు చేసినా రాజకీయంగా ఆయనకు ఎంత వరకూ లాభం అన్నది చూస్తే లేదనే జవాబు వస్తోందిట.
ఇక వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి సీటు మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాదరావు కుమారుడుకే ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. కోడెల టీడీపీకి ఎంతో సేవ చేశారని ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని బలమైన సామాజిక వర్గం నుంచి డిమాండ్ ఉందిట. దాంతో కోడెల తనయుడికే ఈ సీటు రిజర్వ్ అయింది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే అసెంబ్లీ సీట్లు పునర్ విభజన జరిగినా ఒకటి రెండు అయినా కూడా కన్నాకు టికెట్ దక్కడం కష్టమనే అంటున్నారు. యూత్ కే ఈసారి టికెట్లు ఇస్తారని ఆ విధంగా కన్నాకు అది మైనస్ అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఏడు పదుల వయసులో ఉన్న కన్నాకు రాజకీయంగా ఇవే చివరి ఇన్నింగ్స్ అని అంటున్నారు. అందుకే ఆయన మళ్లీ సౌండ్ చేస్తున్నారు అని అంటున్నారు.
ఒకవేళ విస్తరణలో అయినా తనకు మంత్రి పదవి దక్కితే చాలు అన్నది ఆయన ఆలోచనగా ఉందిట. ఆ తరువాత తన తనయుడికి అయినా టికెట్ కన్ఫర్మ్ చేయించుకుని గౌరవంగా రాజకీయ విరమణ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. మరి ఆయన ఆశలు ఆలోచనలు ఏ మేరకు నెరవేరుతాయని అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.