
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న చర్యలతో పొరుగు దేశం పాకిస్తాన్ లో కలవరం మొదలైంది. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే.. పాకిస్థాన్ పరిస్థితిని చూసి సొంత ప్రజలే నవ్వుకుంటున్నారు.. వారి కామెంట్లు చదివితే మీరూ నవ్వాపుకోలేరు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి యావత్ భారతావనిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. మతం పేరుతో అమాయక హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఈ హేయమైన చర్య మీద దేశం మొత్తం భగ్గుమంటోంది. దీనికి ప్రతిస్పందనగా భారత్ దౌత్యపరమైన చర్యలను ప్రారంభించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా పాక్ జాతీయులకు వీసాలను కూడా రద్దు చేసింది. అయితే, పాకిస్థాన్ కూడా తన వంతుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు భారత విమానాల కోసం తన గగనతలాన్ని కూడా మూసేసింది.
ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. పాకిస్థాన్ తన సైనిక బలగాలను భారత సరిహద్దు వైపు తరలిస్తోంది. యుద్ధ విన్యాసాలు చేస్తూ భారత్ దాడిని తిప్పికొట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. పాకిస్థాన్ కెపాసిటీ మీద సొంత ప్రజలకే నమ్మకం లేదు.. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో అక్కడి నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. తమ దేశంలోని దయనీయ పరిస్థితులను ఎత్తిచూపుతూ వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు.
పాకిస్థాన్ తన ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందించలేకపోతున్న తీరును సెటైరికల్ పోస్టులతో ఎండగడుతున్నారు. ఒక యూజర్ ఎక్స్‌లో (ట్విట్టర్) మాట్లాడుతూ, “భారతీయులు పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలని కోరుకుంటే గంటల్లోనే దాన్ని ముగించాలి. లేదంటే ఆ తర్వాత మాకు గ్యాస్ సరఫరా ఆగిపోతుంది” అంటూ తన దేశం దుస్థితిని ఎగతాళి చేశాడు. మరొక యూజర్ మరింత వ్యంగ్యంగా స్పందిస్తూ.. “వారికి మరిన్ని కుంటి సాకులు ఇవ్వకండి. గోధుమ పిండి లేదు, నీరు లేదు, ఎప్పుడూ బిక్షమే.. ఇప్పుడు గ్యాస్ కూడా లేదు” అని పాక్ పేదరికాన్ని ఎత్తి చూపాడు. ఇంకొక నెటిజన్ అయితే “వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి” అంటూ దేశ ఆర్థిక పరిస్థితిని గుర్తు చేశాడు.
పాకిస్థాన్ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ ఒక నెటిజన్ షేర్ చేసిన మీమ్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక మోటార్ సైకిల్‌కు ఫైటర్ జెట్ ఆకారంలో ఉన్న ఒక పేపర్ బొమ్మను అమర్చి నడుపుతున్న మీమ్ అది. ఇక సింధు నది నీటిని భారత్ ఆపాలని నిర్ణయించడంపై ఒక పాక్ యూజర్ తీవ్రంగా స్పందించాడు. “నీటిని ఆపాలనుకుంటున్నారా? మాకసలే నీటి సరఫరా లేదు. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ను తీసుకోవాలనుకుంటున్నారా? అరగంటలోనే దాన్ని మీరు తిరిగి ఇచ్చేస్తారు” అంటూ ఆ దేశ దుస్థితిపై సెటైర్ల వర్షం కురిపించాడు. ఈ కామెంట్లు చూస్తుంటే పాకిస్థాన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. సొంత ప్రజలే తమ ప్రభుత్వాన్ని నమ్మడం లేదు సరికదా.. ఇలా ఎగతాళి చేస్తుండటం నిజంగా ఆ దేశానికి సిగ్గుచేటు.