
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అతడు సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమాగా ఖలేజా వచ్చిన విషయం తెల్సిందే. అతడు సినిమా కమర్షియల్‌గా నిరాశ పరిస్తే ఖలేజా సినిమా థియేట్రికల్ రిలీజ్ సమయంలో డిజాస్టర్‌గా నిలిచింది. అయితే బుల్లి తెరపై మాత్రం ఖలేజా సినిమాకు మంచి స్పందన దక్కింది. ఖలేజా సినిమాలోని కామెడీ సీన్స్‌ను అభిమానించే వారు చాలా మంది ఉంటారు. అంతే కాకుండా ఆ సినిమాలో అనుష్క క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌ను ఎంతో మంది ఇష్టపడుతారు.
ఖలేజా సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్ అయినా త్రివిక్రమ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మహేష్ బాబు ఆ సమయంలో కాస్త సినిమాల ఎంపిక విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ స్లో అయ్యాడు. మొత్తంగా ఖలేజా సినిమా మహేష్ బాబు, త్రివిక్రమ్‌లకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్లుగా మిగిలి పోయింది. ఆ సినిమా తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకుని మహేష్ బాబు, త్రివిక్రమ్ లు గుంటూరు కారం సినిమాతో గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది. కానీ కుర్చీ మడత పెట్టి అంటూ సోషల్ మీడియాలో మహేష్ బాబు డాన్స్‌తో కుమ్మేశాడు. శ్రీలీలకు స్టార్డం తెచ్చి పెట్టింది. ఖలేజా గురించి ఈ మధ్య ఎక్కువగా చర్చ జరుగుతోంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సినిమా అనుకున్న సమయంలోనే ‘ఖలేజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయిన సమయంలో ఖలేజా టైటిల్ తన వద్ద ఉందని, అందుకు సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయంటూ కోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలకు స్టే ఇవ్వాలంటూ కోర్టుకు పిటిషనర్ విజ్ఞప్తి చేశాడు. సినిమా విడుదల సమయంలో ఈ విషయమై రిలీజ్ కి స్టే ఇవ్వడం కుదరదు అంటూ పిటీషనర్కి న్యాయ మూర్తి చెప్పాడు. అయితే మీకు జరిగిన అన్యాయంకు నష్టపరిహారం డిమాండ్ చేయవచ్చు అని సూచించాడు. అదే సమయంలో కోర్ట్‌కు లంచ్ విరామం ఇచ్చారు.
విరామం సమయంలో నిర్మాతలు రూ.10 లక్షలు ఇచ్చేందుకు ఓకే చెప్తే, పిటీషనర్ కూడా సరే అన్నాడట. ఆ తర్వాత కోర్టు ప్రారంభం అయింది. న్యాయమూర్తి రూ.10 లక్షల పరిహారం తీసుకోవాలి అంటూ సూచించగా, పిటీషనర్ రూ.25 లక్షలు కావాలని డిమాండ్ చేశాడట. దాంతో ఈ పరిహారం గొడవ తీరే దారి కనిపించడం లేదు. కనుక ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించాల్సిందే అని న్యాయమూర్తి పిటీషనర్కి మరిన్ని సాక్ష్యాధారాలు తీసుకు రావాల్సిందిగా సూచించారట. అయితే సినిమా విడుదలకు స్టే ఇచ్చేందుకు మాత్రం న్యాయమూర్తి నో చెప్పారు. దాంతో సినిమా విడుదల అయింది, కోర్టులో కేసు అలాగే సుదీర్ఘ కాలం కొనసాగింది. అయితే సినిమాకు లీగల్ సమస్యలు భవిష్యత్తులో కూడా రాకుండా ఉండటం కోసం చిత్ర యూనిట్ సభ్యులు ఖలేజాను కాస్త మహేష్ ఖలేజా గా మార్చేశారు. పోస్టర్లలో ఖలేజా పక్కన మహేష్ అనే పదం ఉండటంను గమనించవచ్చు.