
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తాను వీర్యదానం ద్వారా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్ తండ్రినని ప్రకటించిన దురోవ్, తాజాగా వారందరికీ తన సంపదను పంచుతానని వెల్లడించారు. ఈ ప్రకటన ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
-వీలునామాలో స్పష్టత
తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పావెల్ మాట్లాడుతూ తాను తన వీలునామాను ఇటీవలే రాశానని తెలిపారు. అందులో తన సహజ సంతానంతో పాటు వీర్యదానం ద్వారా జన్మించిన 100 మంది పిల్లలకు కూడా తన సంపదలో సమాన హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సంపదను వారు 30 ఏళ్ల వయసు వరకు పొందలేరని, ఆలోచించగలిగే స్వతంత్ర వ్యక్తులుగా ఎదగాలని తన ఆకాంక్ష అని దురోవ్ తెలిపారు.
-ప్రమాదాల వలయంలో జీవిస్తున్నందుకే..
“నా జీవితంలో ఎన్నో ప్రమాదాలు, శత్రువులు ఉన్నారు. అందుకే 40 ఏళ్ల వయసులోనే వీలునామా రాయాల్సి వచ్చింది” అని పావెల్ వివరించారు. ఆయన ఇంకా వివాహం చేసుకోలేదని, అయితే ముగ్గురు సహజీవన భాగస్వాములతో ఆరుగురు పిల్లలు ఉన్నారని కూడా వెల్లడించారు.
– వీర్యదానం వెనుక అసలు కథ
గత ఏడాది జూలైలో పావెల్ స్వయంగా ఈ వీర్యదానం అంశాన్ని వెల్లడించారు. “15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు తన భార్యకు సంతానాన్ని పొందడం కోసం నన్ను వీర్యదానం చేయమని కోరాడు. మొదట నవ్వుకున్నా, ఆ సమస్య ఎంత తీవ్రమో తెలుసుకుని డొనేషన్ చేశాను. ఆ తర్వాత స్పెర్మ్ బ్యాంకులో రిజిస్టర్ అయ్యాను. అప్పటినుంచి 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలు పుట్టారు. నేను ఆ ప్రాసెస్ ఆపినా, అప్పట్లో ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఇంకా కొన్ని కుటుంబాలకు సంతానం కలుగుతోందని తెలిసింది” అని ఆయన అప్పట్లో తెలిపారు.
– ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం
ప్రస్తుతం పావెల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ లో వైరల్‌గా మారాయి. ఒక ప్రముఖ టెక్ దిగ్గజం తన సంపదను ఇలా 100 మందికి పంచాలని నిర్ణయించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది ఒక ఆసక్తికరమైన, విభిన్నమైన విషయంగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.