
ఏపీ మద్యం స్కాంలో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి పోలీసు విచారణలో ఏం చెప్పాడనేది వైసీపీలో టెన్షన్ పుట్టిస్తోంది. ఈ కేసులో వైసీపీలో కీలక నేతలు సంబంధం ఉందని ప్రభుత్వం ఆరోపిస్తుండటం, ఇదే సమయంలో వైసీపీ నేతల బట్టలు విప్పేస్తానని ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి అరెస్టు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. పోలీసు విచారణలో ఆయన ఏం చెబుతాడనేది ఆసక్తికరంగా మారింది. రాజ్ నోరువిప్పి ఎవరిని బుక్ చేస్తారనే అంశం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. రాజేష్ రెడ్డి అన్న పేరుతో గోవా నుంచి వచ్చిన రాజ్ కసిరెడ్డి పోలీసులు కళ్లు గప్పి తప్పించుకోవాలని చూసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన కదలికలపై హైటెక్ నిఘా వేసిన పోలీసులు గోవా నుంచి వచ్చిన విమానంలో రాజ్ కసిరెడ్డి ఉన్నట్లు గుర్తించారు. ఎరైవల్ బ్లాక్ వద్ద కాపు గాసినా, పోలీసులు ఉన్నారనే సమాచారంతో రాజ్ కసిరెడ్డి విమానశ్రయం నుంచి బయటకు రాకుండా లోపలే దాక్కున్నారని పోలీసులు తెలిపారు. అయితే శంషాబాద్ విమానశ్రయ పోలీసు సిబ్బంది సహకారంతో ఎయిర్ పోర్టులోకి వెళ్లిన పోలీసులు రాజ్ కసిరెడ్డిని గుర్తించి అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని 24 గంటలు లోగా కోర్టులో హాజరు పరచాల్సివున్నందున మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
సోమవారం సాయంత్రం 6 గంటలకు అరెస్టు చేసిన తర్వాత రాజ్ కసిరెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. మంగళవారం వేకువజాము నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా రాజ్ కసిరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. గతంలో నాలుగు నోటీసులు ఇచ్చినా కసిరెడ్డి విచారణకు హాజరుకాకపోవడంపై పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమ నోటీసులను పట్టించుకోకుండా గోవా చెక్కేయడాన్ని సీరియస్ గా తీసుకుని రాజ్ కసిరెడ్డి పరారీకి సహకరించిన వారు ఎవరన్న కోణంలో ముందుగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఐటీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి మద్యం వ్యాపారం చేయడం.. మద్యం కమీషన్ల కోసం ఏడెంచల వ్యవస్థ క్రియేట్ చేయడం వంటివన్నింటికి కసిరెడ్డి సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో ఆయన నుంచి జవాబులు చెప్పించేందుకు పలు ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే మద్యం స్కాంలో విచారణ నిమిత్తం వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. వారు చెప్పిన పలు విషయాలపైనా కసిరెడ్డికి ప్రశ్నించింది. మద్యం స్కాం కు పాత్రధారి, సూత్రధారి అంతా రాజ్ కసిరెడ్డి అంటూ గతంలో విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆయన విచారణ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు, అధికారులకు టెన్షన్ పుట్టిస్తోందంటున్నారు.