తలసేమియా బాధితులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా, మే 8న విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో 3K, 5K, 10K రన్‌ను నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో 25 పడకల తలసేమియా సెంటర్‌ను సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి ప్రారంభించారు. ఇచ్చిన హామీ మేరకు ట్రస్ట్ భవనంలో తలసేమియా సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తలసేమియా పట్ల అవగాహన కోసం విశాఖలో నిర్వహించే ఈ పరుగులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. తలసేమియా బాధితులకు జీవితాంతం అండగా నిలుస్తామని సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నారు.
నారా భువనేశ్వరి మాట్లాడుతూ, “మే 8వ తారీఖున వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా వైజాగ్‌లో ఆర్కే బీచ్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ద్వారా 3K, 5K, 10K థాలసీమియా రన్ 2025ను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తోంది. ఇది కేవలం ఒక రన్ మాత్రమే కాదు, ఒక కాజ్ కోసం మనమందరం కలిసి చేయి చేయి కలిపి, ‘మనందరం ఉన్నాం’ అని తలసేమియాతో బాధపడుతున్న వారికి భరోసా ఇద్దాం. సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలను ఆదుకోవడం మనందరి బాధ్యత” అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, “తలసేమియా రోగులను చూసినప్పుడు, వారు ఎంత కష్టమైన ప్రక్రియలో ఉన్నారో తెలుస్తుంది. ఒక అమ్మాయి, ఇప్పుడే ఎస్ఎస్సీ చదివి అప్లై చేసింది. ఇంకో అబ్బాయి, మ్యాథ్స్ చదవాలని ఆసక్తి చూపిస్తున్నాడు. ఇవి చిన్న చిన్న విషయాలు కావచ్చు, కానీ వారు ఎంతో బాధను అనుభవిస్తున్నారు. ప్రతి 21 రోజులకు వారి రక్త (blood transfusion) మార్చుకోకపోతే, వారి జీవితం అయిపోతుంది. ఈ విషయం ఎంత లోతైనదో చాలా మందికి తెలియదు. కానీ, ఈ రోజు మా తరపున ఈ సమస్యను లోతుగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అందరూ ఈ మే 8 రన్లో పాల్గొనండి. నేను పరిగెత్తుతాను, నడుస్తాను, నా చుట్టూ ఉన్నవారికి ఈ విషయం గురించి చెబుతాను. నా జీవితంలో ఇకపై నేను ఎవరిని కలిసినా, రక్తదానం చేయమని, తలసేమియా రోగులకు సాయం చేయమని చెబుతాను. జీవితాంతం ఈ పని చేస్తాను. చాలా ధన్యవాదాలు” అన్నారు.
