
హైదరాబాద్: అణ్వాయుధాలపై అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు చాలా కీలక దశలో ఉన్నాయని ఐరాస అణు నిఘాసంస్థ చైర్మన్ రాఫెల్ మారియానో గ్రాస్సీ పేర్కొన్నారు. గురువారం ఇరాన్‌లోని అంతర్జాతీయ అణుశక్తి సంస్థను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం చర్చలు చాలా కీలక దశలో ఉన్నాయని, ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరితే ఇరాన్ సమ్మతిని తెలపడంలో ఏజన్సీ కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. సానుకూల అంశాలపై దృష్టిసారించాలని భావిస్తున్నానని అన్నారు. మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికీ హామీలు ఇవ్వలేదని ఒప్పందం కోసం అన్ని అంశాలను అమల్లోకి తీసుకురావాలని అన్నారు. ఎక్కువ సమయంలేదని, అమెరికాను కూడా సంప్రదిస్తున్నానని అన్నారు.బుధవారం రాత్రి ఇరాన్ చేరుకున్న గ్రాస్సీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో సమావేశమయ్యారు. ఇరాన్ అణుశక్తి సంస్థ అధ్యక్షులు మొహమ్మద్ ఎస్లామినితో భేటీ అయ్యారు. అనంతరం ఇరాన్ అణు ప్రాజెక్టులో ప్రదర్శన హాలును సందర్శించారు. సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఇరాన్‌ను సందర్శించిన సమయంలోనే గ్రాస్సీ పర్యటించడం గమనార్హం.గతవారం ఒమన్‌లో జరిగిన మొదటి సమావేశం ముగిసిన సంగతి తెలిసిందే. మరో రౌండ్ చర్చల కోసం ఇరుదేశాలు శనివారంరోమ్లో సమావేశం కానున్నాయి.