
అక్షర తృతీయ రోజు తిరుమలలోని శ్రీవారి బంగారు డాలర్ ను భక్తులు అధిక సంఖ్యలో కొనుగోలు చేశారు. అక్షర తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే మంచిదని, శుభం తెచ్చిపెడుతుందని నమ్ముతారు. అయితే ఈసారి జ్యుయలరీ దుకాణాల కంటే తిరుమలలో శ్రీవారి బంగారు డాలర్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడిందని చెప్పొచ్చు. బంగారం ధరలు పెరగడంతో అక్షర తృతీయ కు బంగారం విక్రయాలు అనుకున్నంత స్థాయిలో జరగలేదని జ్యుయలరీ దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు.
గత ఏడాది కంటే…
గత ఏడాది కంటే తక్కువగానే ఈ ఏడాది అక్షర తృతీయకు జ్యుయలరీ దుకాణాల్లో బంగారం విక్రయాలు జరిగాయంటున్నారు. అందుకు ధరల పెరుగుదలే కారణం. అయితే తిరుమలకు వచ్చిన భక్తులు మాత్రం అక్షర తృతీయ రోజున విపరీతంగా శ్రీవారి డాలర్లను కొనుగోలు చేశారు. నిన్న ఒక్కరోజే తిరుమలలో తొంభయి లక్షల రూపాయల విలువైన డాలర్ల అమ్మకాలు జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గత ఏడాది అక్షర తృతీయకు తిరుమలలో శ్రీవారి డాలర్ల విక్రయం 75 లక్షల రూపాయల వరకు మాత్రమే జరిగింది.