వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 10 లక్షల నగదు, 250 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకరు బస్సు ప్రయాణికులనే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతుండగా, మరొకరు జలసాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. వేసవి కాలంలో తలుపులు తెరిచి నిద్రపోవద్దని సూచించారు. బస్సు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ బస్ స్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగులనే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని కమాన్ చౌరస్తా వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అతడిని పట్టుకున్నారు. అనుమానాస్పదంగా ముఖానికి మాస్క్ వేసుకున్న కంది సంపత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నవాబ్‌పేట గ్రామానికి చెందిన నిందితుడిపై గతంలోనూ కరీంనగర్, అఫ్జల్‌గంజ్‌లో కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 24న కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ మహిళ బ్యాగ్ నుంచి 47 గ్రాముల బంగారం, ఏప్రిల్ 8న గోదావరిఖని నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఓ వృద్ధుడి బ్యాగ్ నుంచి 13 లక్షలు చోరీ చేశాడు. ఫిబ్రవరి 14న హైదరాబాద్ వెళ్లే మరో మహిళ బ్యాగ్ నుంచి 16.5 తులాల బంగారు ఆభరణాలు దొంగలించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 150 గ్రాముల ఆభరణాలు, 10 �లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు.
సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ, “ఇతను రెగ్యులర్ ఆఫెండర్. బస్ డిపోల వద్ద ఇతనిపై గతంలో కరీంనగర్ టౌన్, హైదరాబాద్‌లో కేసులు ఉన్నాయి. ప్రధానంగా బస్ డిపోలలో ప్రయాణికులను టార్గెట్ చేస్తాడు. ప్రయాణికులు అప్రమత్తంగా లేనప్పుడు, వారి బ్యాగులను తెరిచి, లోపల విలువైన వస్తువులు ఉంటే దొంగతనం చేస్తాడు. మా క్రైమ్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాక్ష్యాలు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇతన్ని గుర్తించింది. మొత్తం మూడు కేసులలో ఇతని ప్రమేయం ఉంది. క్రైమ్ నంబర్ 252/25, 251/25, 112/25 వన్ టౌన్ పీఎస్‌లో నమోదయ్యాయి. ఇతని ద్వారా 13 లక్షల నగదులో 10 లక్షలు, 147 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నాం.”
మరో కేసులో వరంగల్ జిల్లా నరసంపేటకు చెందిన సూరా రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. దురలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతూ, గతంలోనూ పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. ఈ నెల 13న నగరంలోని సప్తగిరి కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి, 35,000 నగదుతో పాటు 175 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. అందులో కొంత బంగారాన్ని విజయవాడలో విక్రయించి జలసాలు చేశాడు. డబ్బులు అయిపోవడంతో, కరీంనగర్‌లోని తన బావ ఇంట్లో దాచిన మిగతా బంగారాన్ని అమ్మేందుకు నగరానికి వచ్చాడు. ఈ ఉదయం పద్మానగర్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని గుర్తించి, అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి 100 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. “రెండో నిందితుడు క్రైమ్ నంబర్ 187/25, టౌన్ పీఎస్‌లో నమోదైన కేసులో ప్రమేయం కలిగి ఉన్నాడు. ఈ కేసులో 100 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఈ ఇద్దరి ద్వారా మొత్తం 10 లక్షల నగదు, 247 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నాం. మొత్తం విలువ సుమారు 34 లక్షలు. దీని కోసం ఒక అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 24/7 మా సిబ్బంది ఉంటారు. ఏదైనా నేరం జరిగితే, అవుట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేయవచ్చు, తద్వారా త్వరిత చర్యలు తీసుకోగలం.”
బస్సులో దొంగతనం జరిగినప్పుడు బాధితులు ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. దొంగతనాల నివారణకు కరీంనగర్ బస్ స్టాండ్‌లో అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
