
ఏపీలో ఖాళీ అయిన ఒకే ఒక్క రాజ్యసభ స్థానానికి నామినేషన్ల గడువు ముగుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా తన పదవికి వేణుంబాకం విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అయిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా రాజ్యసభ సీటు కావడంతో ఇది కూటమి పార్టీలకే దక్కింది. ఈ క్రమంలో దీనిని బీజేపీకి కేటాయిస్తున్నట్టు తాజాగా సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ కోరడంతో దీనిని బీజేపీకి కేటాయించారు.
ఈ నేపథ్యంలో ఈ ఒక్క స్థానానికి వరుసగా ముగ్గురు నుంచి నలుగురు పేర్లు వినిపిస్తుండడం గమనార్హం. సీటు మాత్రం బీజేపీకి ఇచ్చినా.. నాయకుల జాబితా మాత్రం పెద్దదిగానే ఉండడం గమనార్హం. వీరిలో విజయసాయిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక, తాజాగా తమిళనాడుకు చెందిన బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై కోసమే మోడీ ఇలా చంద్రబాబును అడిగి మరీ ఈ సీటును తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాజీ యువ ఐపీఎస్ అదికారి కావడం తెలిసిందే.
తమిళనాడులో బీజేపీకి కోసం పనిచేసిన నేపథ్యంలో అన్నామలైకి.. రాజ్యసభ సీటును ఇవ్వడం ద్వారా తమిళనాడులో బీజేపీని ఓ కీలకరాజకీయ పార్టీగా అన్నామలై తీర్చిదిద్దారనడంలో సందేహం లేదు. పైగా.. ఆయన హయాంలోనే బీజేపీ ఒంటరిగా పోటీ చేసి.. 3 ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకుంది. ఇక, ఈ నేపథ్యంలోనే అన్నమలైకి ప్రాధాన్యం ఇవ్వాలని బావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. తాజాగా మాదిగల రిజర్వేషన్ కోసం పోరాడిన మంద కృష్ణమాదిగ పేరు కూడా ప్రముఖంగా తెరమీదికి వచ్చింది.
ఎస్సీ వర్గీకరణ కోసం.. అలుపెరుగని కృషి చేసిన.. కృష్ణమాదిగకు.. ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పేరుకూడా తెరమీదికి రావడం గమనించాల్సిన విషయమే. అటు అన్నమలై.. ఇటు కృష్ణలు ఇద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. పైగా వచ్చే ఏడాది మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాజాగా ఎస్సీలకు ఇచ్చే లెక్క ఉందని బీజేపీ నాయకులు కూడా చెబుతున్నారు. మరోవైపు.. ఇదే సీటు కోసం.. బీజేపీ కీలక నాయకుడు ఒకరు తెలంగాణ నుంచి బరిలో ఉన్నట్టు ప్రచారం ఉంది. మరి ఎవరు వీరిలో లక్కీ లీడర్ అనేది చూడాలి.