
విశాఖపట్నం, 22 ఏప్రిల్ : కాలేజీ సమయంలో సెల్ ఫోన్ ను వాడొద్దని లాగేసుకున్న లెక్చరర్‌ను ఓ విద్యార్థిని చెప్పుతో కొట్టింది. తన ఫోన్ లాగేసుకోవడానికి నువ్వెవరని అంటూ ఎదురుదాడి చేసింది. ఈ ఘటన భీమిలి పట్టణంలోని రఘు కాలేజీ జరిగింది. కాలేజీలో మొబైల్ ఫోన్లు విపరీతంగా వాడటం.. రీల్స్ చేస్తూ చదువులు అటకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఉపాధ్యాయురాలు.. విద్యార్థులను తీవ్రంగా మందలించింది. అయినా పిల్లల్లో మార్పు రాకపోవటంతో.. ఓ విద్యార్థిని సెల్ ఫోన్‌ను తీసుకున్నది. కాలేజీ అన్నాక కొన్ని కట్టుబాట్లు -.. కొంత క్రమ శిక్షణ అవసరం కదా.. ఆ ఉద్దేశంతోనే ఆ విద్యార్థిని మొబైల్ ఫోన్ తీసుకున్నది. ఈ విషయాన్ని ఓ విద్యార్థి చాలా చాలా సీరియస్ గా తీసుకున్నది. క్లాస్ అయిపోయిన తర్వాత కాలేజీ క్యాంపస్ లోనే ఉన్న టీచర్ దగ్గరకు ఆవేశంగా వచ్చిన ఆ విద్యార్థిని.. నా మొబైల్ ఫోన్ ఇవ్వు అంటూ దబాయించింది. ఈ విషయంపైనే ఆ టీచర్ ఏదో చెప్పబోతుంటే.. తన కాలి చెప్పు తీసి బెదిరించింది.. అంతటితో ఆగలేదు.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన చెప్పుతో.. ఆ టీచర్ చెంప పగలగొట్టింది.. నువ్వు ఎవరు నా ఫోన్ తీసుకోవటానికి.. మా వాళ్లను ఎందుకు తిడుతున్నావ్ అంటూ గట్టిగట్టిగా అరుస్తూ టీచర్ ను చెప్పుతో కొట్టింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టు పక్కల ఉన్న టీచర్స్ ఆ అమ్మాయిని పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. టీచర్ అంటే భయం లేదు.. భక్తి అంతకన్నా లేదని తేలింది.