
పహల్గాం మారణకాండ తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం అణువణువు జల్లెడ పడుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ నిఘా వర్గాల సమాచారంతో ముష్కరుల జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పిల్లి ఎలుకల చందంగా సాగుతున్న ఈ వేటలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు చేరువగా వస్తున్నా, వారు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఇంతకీ భద్రతా దళాలు వారిని ఎక్కడెక్కడ గుర్తించాయి? ఉగ్రవాదులు ఎలా తప్పించుకుంటున్నారు? రాబోయే రోజుల్లో ఏం జరగనుందో వివరంగా తెలుసుకుందాం.
లేటెస్ట్ టెక్నాలజీ, స్థానికుల సమాచారంతో ఆ నలుగురు ఉగ్రవాదుల కదలికలను భద్రతా బలగాలు ఇదివరకే నాలుగుసార్లు గుర్తించాయి. అయితే, దట్టమైన అటవీ ప్రాంతం, ఉగ్రవాదుల వ్యూహాత్మక తప్పించుకునే ప్రయత్నాల కారణంగా వారు భద్రతా దళాలకు చిక్కకుండా పోతున్నారు. ఒక సందర్భంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కూడా జరిగాయని తెలుస్తోంది.
దక్షిణ కాశ్మీర్‌లోని విశాలమైన అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు అనేకసార్లు ఉగ్రవాదులకు అత్యంత సమీపంగా వచ్చాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా స్థానికులు అందిస్తున్న కీలక సమాచారంతో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు వారి స్థావరాలను గుర్తిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని అడవులు చాలా దట్టంగా ఉండటం వల్ల వారి కదలికలను గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు తెలుపుతున్నారు.
ఉగ్రవాదులను మొదట అనంత్‌నాగ్‌లోని పహల్గాం తెహసీల్ ప్రాంతంలో గుర్తించారు. కానీ, భద్రతా దళాలు అక్కడికి చేరుకునేలోపే వారు దట్టమైన అడవుల్లోకి తప్పించుకున్నారు. ఆ తర్వాత కుల్గాం అడవుల్లో వారి కదలికలు కనిపించాయి. అక్కడకు చేరుకున్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి మళ్లీ తప్పించుకున్నారు. అనంతరం వారు త్రాల్ కొండల్లో ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. అక్కడి నుంచి కూడా తప్పించుకున్న తర్వాత వారి లొకేషన్ కొకెర్నాగ్లో బయటపడింది. ప్రస్తుతం వారు ఈ ప్రాంతం చుట్టుపక్కలే తలదాచుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒక గ్రామంలోని ఇంట్లో వారు రాత్రి భోజనానికి వెళ్లగా, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో వారు ఆహారం తీసుకుని వెంటనే పారిపోయారిని ఓ సైనికాధికారి తెలిపారు.
ప్రస్తుతం ఉగ్రవాదులు గ్రామాల సమీపంలోకి వెళ్ళినప్పుడు స్థానిక సహాయకుల ద్వారా అడవుల్లోకి ఆహారం తెప్పించుకుంటారు. ఈ సమయంలో భద్రతా దళాలకు మానవ నిఘా ద్వారా సమాచారం అందుతుంది. అయితే, ఈసారి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులు ఒకవేళ కిష్ట్వార్ ప్రాంతంలోకి ప్రవేశిస్తే భద్రతా దళాలకు మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలోని పర్వతాలు పహల్గాం వైపు ఉన్న శిఖరాలతో కలిసి ఉంటాయి. తక్కువ మంచు ఉండటం వల్ల ఉగ్రవాదులు అక్కడి నుంచి దట్టమైన అడవులు ఉన్న జమ్మూ ప్రాంతంలోకి చొరబడే అవకాశం ఉంది.ప్రస్తుతం ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పహల్గాం చుట్టుపక్కల అడవులను క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు. ఏది ఏమైనా త్వరలోనే వాళ్లను పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.