ప్రతి ఆంధ్రుడు “నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి” అని సగర్వంగా చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతుందని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలతో ఆంధ్రుల స్వప్నాన్ని దెబ్బతీయలేరని చాటి చెప్పేందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మే 2, 2025న రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించనున్నట్లు వివరించారు.
ప్రధానమంత్రి మోదీ రాజధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్లతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సరిగ్గా దశాబ్దం క్రితం, 2015లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైఎస్ఆర్సీపీ సర్కారు విధ్వంసం చేసిందని సీఎం మండిపడ్డారు. అందుకే, నేడు మళ్లీ అదే ప్రధానమంత్రి చేతుల మీదుగా పనులను పునఃప్రారంభించి, ఒక అద్భుత రాజధానిని నిర్మించి, విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని తెలిపారు.
గత సర్కారు అమరావతిని దెబ్బతీసిందని, అనేక కుట్రలు, దాడులు చేసిందని ధ్వజమెత్తారు. అయినప్పటికీ, అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజల అభిలాషలకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి ఆ అడ్డంకులను తట్టుకొని నిలబడిందని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే, గత ప్రభుత్వ విధ్వంసం వల్ల ఎదురైన సవాళ్లను అధిగమించి, నిలిచిపోయిన పనులను పట్టాలెక్కించినట్లు వివరించారు. ప్రధానమంత్రి మోదీ రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తి చూపుతున్నారని, ఢిల్లీలో జరిగిన భేటీలో పలు సూచనలు చేశారని సీఎం తెలిపారు.
అమరావతి అనేది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. దీన్ని ఎవరూ దెబ్బతీయలేరని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా, అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే ప్రాంతంగా మారుతుందని అన్నారు. అమరావతి పనులు పునఃప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో, అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. “మన అమరావతి, మన రాజధాని” అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని సీఎం స్పష్టం చేశారు.
రాయలసీమలో వివిధ పారిశ్రామిక కారిడార్లు, ఓడరేవుల నిర్మాణంతో పాటు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధితో ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. అమరావతి పునఃప్రారంభ వేడుకలో కూటమి శ్రేణులంతా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. నేడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన ఆహ్వానం పలకనున్నారు.
వేడుకకు హాజరయ్యేందుకు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్ తరాల కోసం రాజధాని నిర్మాణం జరుగుతోందని, విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సభకు వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేయాలని ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణపై అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని, రవాణా, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సూచనలు, ప్రకటనలు జారీ చేయాలని సీఎం నిర్దేశించారు.
ప్రధానమంత్రి రాకకు సంబంధించి షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కొత్త షెడ్యూల్ను ఆయన వివరించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి మోదీ మే 2, 2025న మధ్యాహ్నం 3:25 గంటలకు అమరావతి చేరుకుంటారు. 3:32 గంటలకు డయాస్పైకి వస్తారు. 3:35 గంటల నుంచి 11 నిమిషాల పాటు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సీఆర్డీఏ రీజియన్లో జరుగుతున్న పనులను చూపించే వీడియో ప్రదర్శన ఉంటుంది. అనంతరం, 4:05 నుంచి 4:45 గంటల వరకు 40 నిమిషాల పాటు ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. 4:45 గంటలకు బయలుదేరి తిరిగి ప్రయాణిస్తారు. 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున, రోడ్ షో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి, ప్రధానమంత్రి హెలికాప్టర్లో దిగిన వెంటనే కారులో నేరుగా కార్యక్రమ స్థలానికి చేరుకుంటారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు, ఎనిమిది రూట్ల ద్వారా రాకపోకలకు ఏర్పాట్లు చేశారు. అదనంగా, మూడు రూట్లను కూడా సిద్ధం చేశారు. 11 ప్రదేశాల్లో పార్కింగ్ సౌకర్యాలు, ఆహార ఏర్పాట్లు ఇబ్బంది లేకుండా చేశారు. ఆ రోజు వాతావరణంలో స్వల్ప మార్పులు ఉండవచ్చని వాతావరణ సూచన ఉంది. వర్షం లేదా జల్లులు పడితే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించాము.”
