పహల్గాం ఉగ్రదాడితో తిరుమల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అలిపిరి తనిఖీ కేంద్రం మొదలు తిరుమలేశుడి ఆలయం వరకు జల్లెడ పడుతున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉన్నారు.
కలియుగ వైకుంఠనాధుని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. పహల్గాం ఘటనతో అప్రమత్తమైన అధికారులు, తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఇటీవల తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం, అన్యమత దుస్తులతో తిరుమలకు చేరుకోవడం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు పాదరక్షలతో రావడం వంటి ఘటనలతో అప్రమత్తమైన అధికారులు, అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రతలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుపతి పోలీసులు, టీటీడీ నిఘా విభాగం అధికారులతో సమన్వయంతో భద్రతా చర్యలను విస్తృతం చేశారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడి ఘటనతో మరింత అప్రమత్తమయ్యారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో భక్తుల వాహనాలు, ఇతర వాహనాలను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసి కొండపైకి అనుమతిస్తున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో భద్రతను పెంచారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను తిరుపతికి తరలిస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీస్, విజిలెన్స్ అధికారులతో కలిసి ఆక్టోపస్ బలగాలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపాయి. మాక్ డ్రిల్‌లో టీటీడీ నిఘా, భద్రత, సివిల్ పోలీసులు, రిజర్వ్ పోలీసులు, ఆలయ వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. అసాల్ట్ డాగ్, ఎనిమీ అటాక్, రూమ్ ఇంటర్వెన్షన్ కార్యకలాపాలు చేసి చూపారు. శ్రీవారి భక్తుల భద్రతలో భాగంగా, ప్రైవేట్ వాహనదారులను జిల్లా యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ అధికారులు భాగస్వాములు చేశారు. ప్రైవేట్ వాహనదారులకు అవగాహన కల్పించేందుకు, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆస్థాన మండపంలో టీటీడీ విజిలెన్స్, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీసులు, డ్రైవర్లు సంయుక్తంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని, తిరుమల సురక్షితమైన ప్రాంతంగా ఉండేందుకు సహకరించాలని ఎస్పీ సూచించారు.
