
ప్రముఖ పుణ్యక్షేత్రం విశాఖపట్నంలోని (Visakapatnam) సింహాచల వరాహ నరసింహ స్వామి భక్తులకు (Devotees) నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తోంది. ఈ సందర్భంగా ఈనెల 30న వైశాఖ శుద్ధ తదియ రోజు స్వామివారి నిజరూప దర్శనం, చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో సింహాచలం దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
స్వామివారి నిజరూప దర్శనం కోసం నేటి (ఏప్రిల్ 24) నుంచి టికెట్లను విక్రయించనున్నారు. దేవస్థానం నిర్దేశించిన ప్రాంతాలతో పాటు ఆన్లైన్లోనూ ఈ నెల 29వ తేదీ వరకు రూ.300, రూ.1000 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈనెల 29 తర్వాత ఎలాంటి విక్రయాలు జరగవు. అలాగే టికెట్లు లేని భక్తులకు ఉచిత దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
టికెట్లు ఎక్కడ లభిస్తాయంటే..?
సింహగిరిపై పాత పీఆర్ఓ కార్యాలయం వద్ద ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు టికెట్ల విక్రయం జరుగుతుంది. అలాగే, సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ శాఖల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, అక్కయ్యపాలెం, మహారాణిపేట యూనియన్ బ్యాంకు శాఖలు, బిర్లా కూడలి, సాలిగ్రామపురంలోని ఎస్బీఐ కార్యాలయాల్లో పని వేళల్లో టికెట్లు తీసుకోవచ్చు. ఆన్లైన్లో www.aptemples.ap.gov.in ద్వారా టికెట్లు పొందవచ్చు.